వైద్య శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ యేటి నోబెల్ పురస్కారం దక్కింది. మేరీ ఈ బ్రుంకోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సాకగుచి నోబెల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు రోగనిరోధక శక్తికి సంబంధించిన కీలక ఆవిష్కరణలను చేసినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది. అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న ఇన్స్‌టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయోలజీలో మేరీ బ్రుంకోవ్ పనిచేస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఉన్న సోనోమా బయోథెరపాటిక్స్‌లో ఫ్రెడ్ రామ్స్‌డెల్ చేస్తున్నారు. జపాన్‌లోని ఓసాకాలో ఉన్న ఓసాకా యూనివర్సిటీలో షిమోన్ సకగుచి విధులు నిర్వర్తిస్తున్నారు.

రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న అంశంలో ముగ్గురు పరిశోధకులు కీలక విషయాలను గుర్తించారు. శరీరంలోని అత్యంత శక్తివంతమైన రోగనిరోధక వ్యవస్థను నియంత్రించాల్సి ఉంటుందని, లేదంటే ఆ వ్యవస్థ మన శరీర అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని దెబ్బతీయకుండా ఉండే పెరిఫరల్ ఇమ్యూన్ టాలరెన్స్ గురించి ముగ్గురు శాస్త్రవేత్తలు స్టడీ చేసినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొన్నది.
















