వాయు కాలుష్యం ఇప్పుడు బయటే కాదు, ఇంట్లోనూ తిష్ఠ వేస్తోంది. నగరాలు, పట్టణాల్లో గాలిలో దుమ్మూధూళి కణాల శాతం ఏటేటా పెరుగుతోంది. సూక్ష్మ, అతిసూక్ష్మ కణాలు ఊపిరితిత్తులోకి ప్రవేశించి రోగాలకు కారణమవుతున్నాయి. ఇరుకిరుకు గదులు, వెలుతురు లేకపోవడం, వాయు కాలుష్యంతో నగరవాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దుమ్మూధూళి నుంచి రక్షణ కోసం ఇప్పుడు చాలా మంది ఎయిర్ ప్యూరిఫైయర్లను వినియోగిస్తున్నారు. కొంచెం ఖర్చు అయినప్పటికీ అరోగ్యం కోసం వెనుకాడటం లేదు. కార్యాలయాలు, గృహాల్లో వీటీ వాడకం క్రమంగా పెరుగుతోంది. అలర్జీల నుంచి కాపాడుకునేందుకు కొందరు వీటిని కొనుగోలు చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమాతో ఇబ్బంది పడే వారున్న ఇళ్లలో ప్రస్తుతం ఇది తప్పనిసరి అవసరంగా మారిపోయింది.

ఇళ్లలో స్వచ్ఛమైన గాలి కోసం ఎయిర్ ఫ్యూరిఫైయర్ల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ఢల్లీి నగరాల్లో ఆర్థికంగా ఉన్న వారు మాత్రమే వినియోగిస్తుండగా, ఇటీవల చిన్న నగరాలు, పట్టణాల్లోని మధ్య తరగతి ప్రజలు వీటి అవసరాన్ని గుర్తిస్తున్నారు. వాటర్ ప్యూరిఫైయర్ లాగే, ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా నిత్యావసర వస్తువుగా మారుతోంది. కోవే, డైసన్, ఫిలిప్స్ షియోమీ, షార్ప్ కంపెనీలు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. మార్కెట్‌లో రూ.7వేల నుంచి 50 వేల వరకు ధరల్లో అందుబాటులో ఉన్నాయి. 2025 ప్రథమార్థంలో దేశవ్యాప్తంగా అమ్మకాలు గతేడాది కంటే 38 శాతం మేర పెరిగాయి.

ప్యూరిఫైయర్ల ఎంపికలో హెపా ఫిల్టర్, సీఏడీఆర్ రేటింగ్, వెంటిలేషన్ మోడ్, నాయిస్ లెవల్, సెన్సర్లు, ఏక్యూఐ ఇండికేటర్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. హెపా ఫిల్టర్లు పీఎం 2.5, పీఎం 10 ధూళి కణాలను వడపోస్తాయి. కొన్ని మోడళ్లలో పొగమంచు, ధూమపానం వాసననూ తొలగించే ఫీచర్లు ఉన్నాయి. వంటింట్లో పొగ, ఇతర రసాయనాలను శుద్ధి చేస్తాయి. కొవిడ్ తర్వాత వీటి వినయోగం విపరీతంగా పెరిగింది. వాటిలోని ఫిల్టర్లు గాలిలోని ధూళి కణాలతో పాటు, బ్యాక్టీరియా, వైరస్‌లను క్లియర్ చేస్తాయి. సాధారణంగా గాలి ద్వారా వ్యాప్తి చెందే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, అడినో వైరస్, రైనో వైరస్, ఫ్లూ వంటి వాటి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. సరైన సమయంలో ఫిల్టర్లు మార్చుకుంటూ వినియోగించుకుంటే బాగుంటుంది.
















