చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ వివాదాస్పద నటి, మోడల్ పూనమ్ పాండే మృతి చెందారు. పూనమ్ వయసు ప్రస్తుతం 32 ఏళ్లు. గత కొన్ని రోజులుగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న పూనమ్ పాండే గురువారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పూనమ్ టీమ్ ధ్రువీకరించింది. ఈ ఉదయం మాకు చాలా కఠినమైనది. గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మరణించారని తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాము అని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ 2013లో నషాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. పలు హిందీ సినిమా ల్లో నటించిన ఆమె కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరించిన రియాల్టీ షో లాకప్ తొలి సీజన్‌లో పాల్గొన్నారు. ఇదే ఆమె పాపులారిటీ పెరగడానికి కారణమయింది. ఆమె వైవాహిక జీవితం కూడా వివాదా స్పదమైంది. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆమె నటించిన చివరి చిత్రం ది జర్నీ ఆఫ్ కర్మ. అయితే సినిమాలకన్నా వివాదా స్పద వ్యాఖ్యలతోనే ఆమె పాపులర్ అయింది. 2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా చేసిన ఓ ప్రకటనతో పూనమ్ చాలా పాపులర్ అయ్యారు. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలోకి వస్తానంటూ ఆమె చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది.