అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కానున్నారు. మరికొన్ని గంటల్లో సమావేశం జరుగనుండగా పుతిన్‌ను ట్రంప్ హెచ్చరించారు. శుక్రవారం నాటి చర్చల తనంతరం ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని పుతిన్ ఆపకపోతే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ భూభాగం విషయంలోనే చర్చలుంటాయని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు ఇతర ఐరోపా నేతలతో వర్చువల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం అలస్కాలో పుతిన్‌తో భేటీ సవ్యంగా సాగుతుందని భావిస్తున్నానని చెప్పారు. యుద్ధాన్ని ఆపేదిలేదని పుతిన్ చెబితే రష్యా తీవ్ర పర్వావసానాలు ఎదుర్కోక తప్పదన్నారు. రెండో దఫా ఆంక్షలు కూడా విధించాల్సి వస్తుందని తెలిపారు.

ఒకవేళ ఈ భేటీ సత్ఫలితాలిస్తే జెలెన్‌స్కీని కూడా కలుపుకొని మరో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించారు. అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని తెలిపారు. ఇరువురి భేటీలో తనను అనుమతిస్తే భాగస్వామినవుతానని చెప్పారు. కాగా, అలస్కాలో జరుగనున్న ట్రంప్, పుతిన్ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతున్నదని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం జరిగే గదిలో వారిద్దరితోపాటు అనువాదకులు మాత్రమే ఉంటారని పేర్కొన్నాయి. ఇంకేవరికీ ప్రవేశం ఉండబోదని తెలిపాయి.















