
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు కేంద్రంగా ఉన్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని త్వరలో రద్దు చేసే లేదా పరిమితం చేసే ప్రతిపాదన అమెరికా అంతర్గత భద్రతా శాఖ వద్ద సిద్ధంగా ఉంది. ఈ ప్రతిపాదిత ఇమిగ్రేషన్ నిబంధన 2025 చివరిలో లేదా 2026 ఆరంభంలో అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇది అమలైతే విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకుని, ఆపై పనిచేయడానికి ఉన్న అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపీటీ కార్యక్రమం ద్వారా, అంతర్జాతీయ విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన తర్వాత లేదా మధ్యలో తమ అధ్యయన రంగానికి సంబంధించిన ఉద్యోగంలో 12 నెలల పాటు పనిచేయడానికి అనుమతి లభిస్తుంది.ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విద్యార్థులకు అదనంగా 24 నెలల పొడిగింపు కూడా ఉంటుంది. ఈ పథకం ద్వారా ఏటా సుమారు 2,50,000 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు.















