అమెరికా అధ్యక్ష పగ్గాలను రెండోసారి చేబూనిన డొనాల్డ్ ట్రంప్ మొదటిరోజే కఠినమైన నిర్ణయాలు తీసుకొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకొచ్చారు. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం ముగియగానే పెన్ను అందుకున్నారు. పదుల సంఖ్యలో కార్యనిర్వాహక ఉత్తర్వులపై (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు) సంతకాలు చేశారు. వలసల నుంచి మొదలుకొని పర్యావరణం, వాణిజ్యం వరకు అమెరికాకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల రూపంలో ట్రంప్ అమలులోకి తీసుకొచ్చారు. తన ఆలోచనల అమలులో కఠినంగా ఉండనున్నట్టు ఆయన చెప్పకనే చెప్పారు. ఈ నిర్ణయాలు అమెరికాతో పాటు ప్రపంచంపైనా ప్రభావాన్ని చూపనున్నాయి.
ముఖ్యంగా జన్మతః పౌరసత్వం విధానం రద్దు చేస్తూ ట్రంప్ తీసుకొన్న నిర్ణయం, లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం పించనున్నట్టు నిపుణులు చెప్తున్నారు. అమెరికా పౌరులకు పుట్టిన వారికే కాకుండా, వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే, చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతున్నది. అయితే, దీన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదు అని ట్రంప్ ప్రకటించారు.