ప్రమాదకరమైన బయోలాజికల్ ప్యాథోజన్ ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు చైనీయులను అమెరికా అరెస్టు చేసింది. పరిశోధన కోసం ఆ ప్యాథోజన్ స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా ఆ బయోలాజికల్ ప్యాథోజన్‌ను వాడేందుకు ప్రయత్నాలు జరిగినట్లు అమెరికా ఆరోపించింది. వ్యాధికారక ఆ ఫంగస్ శాస్త్రీయ నామం పుసేరియం గ్రామినేరియం. శాస్త్రీయ పరంగా దీన్ని ఆగ్రో టెర్రరిజం వెపన్‌గా వినియోగిస్తారని అమెరికా న్యాయ శాఖ చెప్పింది. వివిధ రకాల పంటలు ఆ ఫంగస్ సోకితే చనిపోతాయి. దీంతో భారీ స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. దీని వల్ల బిలియన్లలో నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొన్నది.

ఫుసేరియం గ్రామినేరరియం వల్ల పంటలకు నష్టమే కాదు.. ఆ ఆహారం తిన్న మనుషులకు రకరకాల వ్యాధులు సోకే అవకాశాలు ఉన్నాయి. వాంతులు, లివర్ డ్యామేజ్ కావొచ్చు. మనుషులతో పాటు జంతువుల్లో, ప్రత్యుత్పత్తి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. బయోలాజికల్ ఫంగస్ వెపన్‌ను స్మగ్లింగ్ చేసిన కేసులో 33 ఏళ్లు యున్కింగ్ జియాన్, 34 ఏళ్ల జుయాంగ్ లియూలను అరెస్టు చేశారు. వారిపై కుట్ర, స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. తప్పుడు ప్రకటనలు చేశారని, వీసా ఫ్రాడ్ కేసు కూడా వాళ్లపై బుక్ చేసినట్లు మిచిగన్ జిల్లా జడ్జి పేర్కొన్నారు.
