మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నదని, తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తున్నదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయబారి అబ్దుల్ నసీర్ అల్‌షాలీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం కల్పిస్తున్న మౌలిక వసతుల కారణంగా భవిష్యత్తులో హైదరాబాద్ ముఖచిత్రం మరింతగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో ఉన్న స్టార్టప్ ఎకో సిస్టం, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న పురోగతిని ప్రత్యేకంగా కొనియాడారు.
ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుతో అబ్దుల్ నసీర్ అల్‌షాలీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామికరంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను యూఏఈ రాయబారికి మంత్రి కేటీఆర్ వివరించారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని స్టార్టప్ ఎకో సిస్టంతో ఫ్రాన్స్ అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఇకో సిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈ లోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్‌కు పరిచయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై యూఏఈ రాయబారి సానుకూలంగా స్పందిస్తూ తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను హైదరాబాద్ ఇకో సిస్టంలోని స్టార్టప్ సంస్థలతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.