
జపాన్ తెలుగు సమాఖ్య ( జేటీఎస్) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను టోక్యోలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంబరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జేటీఎస్ ప్రతినిధులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. జపాన్‌లోని తెలుగు ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారని జేటీఎస్ పేర్కొంది. బిజీ షెడ్యూల్‌లోనూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని పేర్కొంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారసత్వాన్ని చాటుతూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, దక్షిణాది రుచులతో పండగ వాతావరణం నెలకొంది. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకలో 500కు పైగా తెలుగు కుటుంబాలు పాల్గొని సందడి చేశాయి.
