రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య గత కొన్ని నెలలుగా సుదీర్ఘ యుద్ధం కొనసాగుతున్నది. ఈ యుద్ధంలో రెండు దేశాలు భారీగా నష్టపోయినా ఎక్కువ నష్టం మాత్రం ఉక్రెయిన్‌కే జరిగిందని చెప్పవచ్చు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలు రష్యా దాడుల్లో ధ్వంసమయ్యాయి. సైనిక స్థావరాలు, సహజ వనరులు, కీలక కట్టడాలు విధ్వంసానికి గురయ్యాయి.ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రష్యాతో యుద్ధం మొదలైన సమయంలో వీలైనంత మంది రష్యన్‌లను చంపేయండని పశ్చిమ దేశాలు చెప్పనట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ ఒక ప్రకటన చేశారు. యుద్ధం మొదలైన తర్వాత నాటో ఉక్రెయిన్‌కు దన్నుగా నిలువకముందు, వీలైనంత మంది రష్యన్‌లను చంపేయాలని పశ్చిమ దేశాలు చెప్పినట్లు రెజ్నికోవ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, యుద్ధం జరుగుతున్న తీరును చూస్తే రష్యాపై పైచేయి సాధించడానికి పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌ను పావుగా వాడుకున్నట్లు అర్థమవుతున్నది. పశ్చిమ దేశాలు ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ కేవలం 5 పట్టణాలను మాత్రమే తిరిగి తన అధీనంలో తెచ్చుకోగలిగింది. అందులో రెండు పట్టణాలపై రష్యా బలగాలు బాంబులు వేసి బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో ఈ సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్ ఇక అలసిపోయినట్లే కనిపిస్తున్నది.