ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో ఆయన నటించి నిర్మించిన ఈ చిత్రం యూనివర్సిటీ. ఈ సినిమాను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ప్రొషెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ఐఏఎస్ అధికారి ఆకురాతి మురళి, బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ పేపర్ లీకేజ్ అనేది విద్యావ్యవస్థకు పట్టిన గ్రహణం. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షల్లోనూ పేపర్ లీకేజ్‌లు. ఇలా అయితే విద్యార్థుల భవితవ్యం ఏమవ్వాలి? నిరుద్యోగులు ఎన్నిసార్లు పరీక్షలు రాయాలి? ఈ ప్రశ్నలకు సమాధానమే నా యూనివర్సిటీ అన్నారు.
ఇది విద్యార్థులేకాదు, తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమా అని హరగోపాల్ అన్నారు. ప్రభుత్వ విద్యారంగం బలోపేతమైతే, పైవేటు విద్యారంగం కుదేలవుతుందని, ఫీజులకోసం తల్లిదండ్రుల్ని పీల్చిపిప్పిచేసే ఈ దారుణాలకు తెరపడుతుందని కంచె ఐలయ్య అభిప్రాయపడ్డారు. విద్య, పని రాజ్యాంగం మనకిచ్చిన హక్కని, దానికోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐఏఎస్ అధికారి ఆకురాతి మురళి అన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరి గౌరీశంకర్, పాశం యాదగిరి, సుద్దాల అశోక్‌తేజ, జయరాజ్, ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ కాశిం, ఇంకా బి.సి నాయకులు గణేశాచారి, దర్శకులు కాశీవిశ్వనాత్, వైఎస్ కృష్ణేశ్వరరావు ఇంకా అనేక విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది.