తమ లక్ష్యాల్ని సాధించేవరకు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు చోటులేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నవేళ చాలా రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు రష్యా పౌరులు, రెండోసారి సైనిక సమీకరణ చేపడతారా? పౌరుల్ని బలవంతంగా యుద్ధ క్షేత్రంలోకి పంపుతారా? అని పుతిన్ ముందు సందేహం వ్యక్తం చేశారు. అయితే రష్యాకు ఇప్పుడా అవసరం లేదని పుతిన్ సమాధానమిచ్చారు. మాస్కోలో జరిగిన మీడియా, టెలిఫోన్ కాల్, వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విలేకర్లు, రష్యన్ పౌరుల నుంచి ఎదురైన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, గాజా సంక్షోభం, రష్యా ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. దాదాపు 24 ఏండ్లుగా రష్యాను ఏలుతున్న పుతిన్, మరోసారి అధ్యక్ష పదవి ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థి ఎవరూ లేకపోవటంతో, పుతిన్ ఎంపిక దాదాపు లాంఛనమేనని చెప్పాలి. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన తర్వాత పుతిన్ మీడియా ముందుకు రావటం ఇదే మొదటిసారి.
