
భారత కుబేరుడు, అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. యూఎస్ కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. మోసం, లంచం ఆరోపణలపై ఈ వారెంట్ జారీ చేశారు. భారత్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్.. వివిధ రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు 265 మిలియన్ డాలర్లు (రూ. 2,238 కోట్లు) లంచంగా ఇవ్వజూపినట్టు న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఇదే విషయమై ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారానికి సంబంధించి గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదవ్వడమే గాకుండా అరెస్టు వారెంట్ కూడా జారీ అయినట్టు తెలిసింది.
