అమెరికాలో నివసిస్తున్నారా? గ్రీన్ కార్డు ఉందా? అయినప్పటికీ ఈ నెల 7 నుంచి మీరు దేశీయంగా విమానాల్లో ప్రయాణించాలంటే మీ రియల్ ఐడీని చూపించాల్సి ఉంటుంది. రాష్ట్రం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా రియల్ ఐడీకి అనుకూలంగా లేని ఐడీలను ఇకపై విమానాశ్రయాలలో చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రంగా అంగీకరించరు. అంటే 7వ తేదీ నుంచి ప్రయాణించేటప్పుడు పాస్‌పోర్ట్ వంటి ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ ఐడీ ఫారమ్‌తో ప్రయాణించాలి.

లేదా వారి రాష్ట్ర మోటారు వాహనాల విభాగం (డీఎంవీ) కార్యాలయాల ద్వారా జారీ చేసిన రియల్ ఐడీ కోసం నమోదు చేసుకోవాలి. ఒకవేళ ప్రయాణికులు ప్రభుత్వ ఐడీ, లేదా ప్రత్యామ్నాయ ఐడీని కనుక చూపించడంలో విఫలమైతే వారు అదనపు స్క్రీనింగ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లేదా వారికి ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ చెక్‌పాయింట్ల వద్దకు ప్రవేశాన్ని తిరస్కరించవచ్చునని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (డీహెచ్‌ఎస్) ప్రకటించింది.
