శ్రీ సింహా కోడూరి, కావ్య కళ్యాణ్‌రామ్ జంటగా నటిస్తున్న సినిమా ఉస్తాద్. ఈ చిత్రాన్ని రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఫణిదీప్ దర్శకుడు. ఈ మూవీ సింహాకు నాలుగోది. ఈ చిత్ర టీజర్‌ను నటుడు రానా విడుదల చేశారు. రానా మాట్లాడుతూ ఈ సినిమా టీజర్లో ప్రతి అంశం ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్‌ను మోటార్ బైక్‌కు పెట్టుకున్నాడంటే దర్శకుడి ధైర్యానికి మెచ్చుకోవాలి అన్నారు. హీరో శ్రీసింహా మాట్లాడుతూ ఈ కథ ప్రకారం హీరోకు బైక్ నడపడం వచ్చి ఉండాలి. అయితే నాకు బైక్ డ్రైవింగ్ బాగా రాదు. ఈ విషయం దర్శకుడికి ముందే చెబితే నన్ను వద్దంటాడని చెప్పలేదు. నా క్యారెక్టర్‌కు బైక్ ఎలా హెల్ప్ అయ్యిందో ఆసక్తికరంగా దర్శకుడు తెరకెక్కించారు అన్నారు. నటి కావ్య కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ టీజర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా సినిమాలో ఎలాంటి వినోదం ఉంటుందనే దానికి ఈ టీజర్ ఒక చిన్న శాంపిల్ మాత్రమే. ఒక కొత్త తరహా మూవీగా ఆకట్టుకుంటుంది అని చెప్పింది.


