వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమా సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్ లో చాలా ముఖ్యమైన షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఓ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్ వేశారు. మొదటి షెడ్యూల్ లో ప్రధాన నటులపై కీలకమైన సన్నివేశాలను, ఫైట్ సీక్వెన్స్ ను గ్రాండ్ గా రూపొందించారు. సినిమా రూపుదిద్దుకుంటున్న తీరు పట్ల చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది.

సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ అద్భుతమైన స్పందన తో ఆసక్తిని పెంచాయి. సైంధవ్ భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో రూపొందుతోంది. వెంకటేష్ కెరీర్లో ఇది అత్యంత కాస్ట్లీ మూవీ. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర నటీనటులను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

