నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా స్పై. ఐశ్వర్య మీనన్ నాయికగా నటిస్తున్నది. గ్యారీ బీహెచ్ దర్శకుడు. కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నిఖిల్ మాట్లాడుతూ ఎన్ని విజయాలు వచ్చినా నా ప్రతి సినిమాను కొత్త చిత్రంగానే భావిస్తా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మనకు చాలా విషయాలు తెలియవు. ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్, స్వాతంత్య్రం కోసం ఆ సంస్థ చేసిన కార్యకలాపాల గురించి మనకు అవగాహన లేదు. అలా తెలియని విషయాలను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. వినోదంతో పాటు దేశం తెలుసుకోవాల్సిన అంశాలుంటాయి అన్నారు.
దర్శకుడు గ్యారీ బీహెచ్ మాట్లాడుతూ ఈ సినిమాకు ఎడిటింగ్ కోసం వస్తే డైరెక్షన్ కూడా చేయమన్నారు. దర్శకుడిగా నా పేరు నిఖిల్ చెప్పాడని తర్వాత తెలిసింది. యాక్షన్ థ్రిల్లర్ కథ కోసం ఏడాదిన్నరగా కష్టపడ్డాం అన్నారు. నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి మాట్లాడుతూ టీజర్ చూస్తే రాజశేఖర్ రెడ్డి ఎంత బాగా కథ రాశాడనేది తెలుస్తుంది. సినిమా చూసి థ్రిల్ అవుతారు. మా సంస్థలో మరిన్ని మంచి చిత్రాలు చేస్తాం అన్నారు. జూన్ 29న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో నాయికలు ఐశ్వర్య మీనన్, సాన్య ఠాకూర్, మాటల రచయిత అనిరుధ్, సంగీత దర్శకులు శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్, ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సి.ఇ.ఓ. చరణ్‌తేజ్, సినిమాటోగ్రాఫర్లు వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), అభినవ్ గోమటం, యాక్షన్ డిజైన్ రాబిన్ సుబ్బు, బాబీ, నిఖిల్ సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.