రవికృష్ణ కథానాయకుడిగా నటించిన థ్రిల్లర్ మూవీ ది బర్త్‌డే బాయ్. సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల కీలక పాత్ర లు పోషిస్తున్న ఈ చిత్రానికి విస్కీ దర్శకుడు. ఐ.భరత్ నిర్మాత. ఈ సందర్భంగా రవికృష్ణ విలేకరులతో ముచ్చటించారు. అయిదుగురు స్నేహితుల్లో ఒకడు ఓ ఇన్సిడెంట్‌లో చనిపోతాడు. మిగతా నలుగురూ ఆ సిట్యువేషన్‌ను ఎలా హ్యాండిల్ చేశారు? పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నారు.? ఒకవేళ అరెస్ట్ అయితే ఎలా బయటపడ్డారు? అనే ఆసక్తికరమైన ప్రశ్నల సమాహారం ఈ సినిమా. నిజంగా జరిగిన సంఘటన ఆధారం గా తెరకెక్కిన సినిమా ఇది. నాక్కూడా ఈ తరహా కథలంటే ఇష్టం. వినగానే నచ్చేసింది. అందుకే ఒప్పుకున్నా అని అన్నారు.
నా ఫైనల్ గోల్ సినిమాల్లో నటించడం. నాకు సినిమాలంటే పిచ్చి. అన్ని తరహా పాత్రలు చేసి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం నా ఆశయం. అందుకే మంచి అవకాశాలకోసం ఎదురుచూశా. విరూపాక్ష తర్వాత అవకాశాలు బాగా వస్తున్నాయి. ఇందులో ఐదుగురు స్నేహితుల్లో ఒకడి సోదరుడి పాత్ర నాది. ఫుల్‌లెంగ్త్ ఉంటుంది. ఒక ట్రూ ఎమోషన్, ట్రూ డ్రామా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. 48 గంటల్లో జరిగే ఈ కథలో ఫిక్షన్ డ్రామా ఉత్కంఠభరితంగా ఉంటుంది అని తెలిపారు. వందకోట్ల విరూపాక్షలో కీలక పాత్ర పోషించడం తన అదృష్టమని, ఆ సినిమా టైమ్‌లోనే ఈ అవకాశం వచ్చిందని, విరూపాక్షలో మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించిన దర్శకుడు కార్తీక్‌వర్మ దండు, సుకుమార్, సాయిదుర్గతేజ్‌లకు కృతజ్ఞతలని చెప్పారు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది.