రష్యాతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ తమ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడాన్ని చైనా ఖండించింది. అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి భద్రతా సమితి (యుఎన్‌ఎస్‌సి) నిబంధనలను అనుసరించి అమెరికా చర్యలకు ఆధారాలు లేవని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన, ఏకపక్ష ఆంక్షలను ఉపసంహరించుకోకపోతే చైనా నుండి ప్రతిఘటనలు ఎదుర్కొంటారని అన్నారు. అమెరికా విధిస్తున్న ఈ ఆంక్షలు ఏకపక్షం, చట్టవ్యతిరేకం, చైనీయుల ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ఈ చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. శాంతిచర్చలకు తీవ్రంగా యత్నించామని, అలాగే రాజకీయంగా పరిష్కారాన్ని కోరుతున్నామని అన్నారు. మరిన్ని ఆయుధాల విక్రయం కోసం అమెరికా ఇరు దేశాల మధ్య నెలకొన్న సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోందని అన్నారు. అమెరికా సంఘర్షణకు ఒకవైపు ఆయుధాలను సరఫరా చేయడం, తద్వారా యుద్ధాన్ని పొడిగించడంతో పాటు శాంతి చర్చలు లేకుంగా చేస్తోందని మావో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో రష్యాకు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందని అసత్య ప్రచారం చేస్తూ, చైనా కంపెనీలపై ఆంక్షలు విధిస్తోందని అన్నారు.
