టిబెట్ సంస్కృతిని చెరిపివేయడానికి చైనా ప్రయత్నిస్తున్నదని అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆరోపించారు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న నాన్సీ పెలోసీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో బౌద్ధమత గురువు దలైలామాతో సమావేశం అయ్యారు. ఆమెతోపాటు అమెరికా చట్టసభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ మెక్ కాల్, ఇతర సభ్యులు ఉన్నారు. గతంలోనూ అమెరికాలో చైనా అధ్యక్షుడు పర్యటించినప్పుడూ ఇదే విషయం చెప్పా. టిబెట్ సంస్కృతిని చెరేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకించాను. అయితే, టిబెట్ లో చైనా చేస్తున్న అభివృద్ధిని చూడాలని నాతో ఆయన చెప్పారు. అందుకు నేను ధన్యవాదాలు తెలిపా. 25 ఏండ్లుగా టిబెట్ వీసా కోసం ప్రయత్నిస్తున్నా అని నాన్సీ పెలోసీ చెప్పారు.
భాష వాడకాన్ని తగ్గించి టిబెట్ సంస్కృతిని చెరిపేందుకు చైనా ప్రయత్నాలను అమెరికా ఎంత మాత్రం సాగనివ్వబోదని నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు. ఈ విషయమై చైనాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అవసరమైన బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో సంతకం చేస్తారన్నారు. రిసాల్వ్ టిబెట్ చట్టంపై టిబెట్ నేతలతో చర్చించాలని చైనాను కోరనున్నట్లు చెప్పారు. తొలుత టిబెట్ లో పర్యటించిన నాన్సీ పెలోసీ టీం, అక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు చేరుకుని దలైలామాతో భేటీ కావడం గమనార్హం.