నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన పానిండియా డివోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండ : తాండవం. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. డిసెంబర్ 5న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడారు. బోయపాటితో మూడు సినిమాలు చేశాను. మూడూ హిట్లే. ఇది నాలుగో సినిమా. శివశక్తే మమ్మల్ని ప్రేరేపించి ఈ సినిమా చేయించిం ది. సనాతనధర్మ పరాక్రమం ఏంటో చూపించే సినిమా ఇది. దేశాన్ని కాపాడేవాళ్లు సైనికులైతే, ధర్మాన్ని కాపాడేవాళ్లు అఘోరాలు, యోగులు. ఈ విషయాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు బోయపాటి. ధర్మానికి అపచారం జరిగితే దైవం సహించడని చెప్పే సినిమా ఇది. ఇదొక మహాయజ్ఞం. బోయపాటితో నేను చేసిన ప్రతి సినిమా అలాగే సాగింది. నటీనటులు, సాంకేతిక నిపుణులంతా ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ సినిమా విషయంలో మనం ఇంకా ఎన్నో పండుగలు చేసుకోబోతున్నాం అని బాలకృష్ణ నమ్మకంగా చెప్పారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ సెన్సార్ పూర్తయింది. యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత దర్శకునిగా నా గౌరవం పెరుగుతుందని సెన్సార్ సభ్యులు అభినందించారు. చాలా ఆనందం అనిపించింది. సాంకేతికంగా అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. అఖండ జనాల్లోకి చొచ్చుకుపోయింది. అఖండ 2 అంతకు మించి ఉండాలని ముందే అనుకున్నాం. చేశాక చూసుకుంటే భగవంతుడే మాతో ఈ సినిమా చేయించాడనిపించింది. ధర్మానికి ద్రోహం జరిగితే, మృత్యుంజయుడైన దేవుడే మృత్యువై మీదపడతాడు.. అతడే అఖండ. డిసెంబర్ 5 రాబోతున్నాం. విజయం తథ్యం అని చెప్పారు. అరుణాచలం వెళ్లాలంటే చాలా అదృష్టం ఉండాలి. అఖండ 2 లాంటి సినిమా చేయాలంటే చాలా బలం ఉండాలి అని సంగీత దర్శకుడు తమన్ పేర్కొన్నారు.
















