సుమయ రెడ్డి కథానాయికగా నటిస్తూ నిర్మాతగా, రచయితగా కూడా పనిచేసిన చిత్రం డియర్ ఉమ. రాజేష్ మహాదేవ్ దర్శకుడు.ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో జరిగే మోసాలను ఈ చిత్రంలో చూపించాం. డాక్టర్స్, పేషెంట్స్‌కు మధ్య ఉండే వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ఎలాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయో తెలియజెపుతున్నాం అన్నారు.

కరోనా సమయంలో ప్రతీ రోజు తనకు ఓ కల వచ్చేదని, అది వెంటాడుతున్నట్లుగా అనిపించేదని, ఆ కల ఆధారంగా కథ రాసుకున్నానని తెలిపారు. ఫిక్షనల్ కథే అయినా ఇందులో చక్కటి సామాజిక సందేశం ఉంటుందని, ప్రజల్ని చైతన్యవంతం చేసేలా ఉంటుందని చెప్పారు. రాజ్ తోట కెమెరా విజువల్స్, రథన్ సంగీతం ప్రధానాకర్షణలుగా నిలుస్తాయని సుమయ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 18న విడుదలకానుంది.
