ఏ దేశం వెళ్లినా భారతీయులుంటారు. అందులోనూ తెలుగువాళ్లు కచ్చితంగా ఉంటారు. అయితే, అమెరికాలో మాత్రం మనోళ్లంతా పాతుకుపోతున్నారట. గత ఎనిమిదేండ్లలో తెలుగువాళ్ల జనాభా నాలుగు రెట్లు పెరిగింద ట. అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక ప్రకారం.. 2016లో అమెరికాలో 3.2 లక్షల మంది తెలుగువాళ్ల జనాభా ఉండగా, 2024నాటికి ఆ సంఖ్య 12.3 లక్షలకు చేరుకున్నది. కాలిఫోర్నియాలో 2 లక్షలు, టెక్సాస్ 1.5 లక్షలు, న్యూజెర్సీ 1.1 లక్షలు, ఇల్లినాయిస్‌లో 83 వేలు, వర్జీనియాలో 78 వేలు, జార్జియాలో 52 వేల మంది తెలుగు వాళ్లు ఉన్నారు. ఇందులో దాదాపు 10 వేల మంది హెచ్1బీ వీసా పొందారు.
ఏటా 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు యూఎస్ వెళ్తున్నారు. వీరిలో 80 శాతం మంది తమ వద్ద రిజిష్టర్ చేయించుకున్నవారేనని ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాజీ కార్యదర్శి అశోక్ కొల్లా తెలిపారు. అక్కడికి వెళ్లిన వారిలో 75 శాతం మంది స్థిరపడ్డారు. ఎక్కువగా డల్లాస్, బేఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్‌విల్లేలో స్థిరపడ్డారు. అమెరికాలోని 350 విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉన్నది. హిందీ, గుజరాతీ భాషల కంటే తెలుగు మాట్లాడేవారే ఎక్కువ. ఏటా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు, 10 వేల మందికి పైగా హెచ్1బీ వీసాపై అమెరికాకు చేరుకోవడమే అక్కడ మన హవా ఇంతగా పెరడగానికి ప్రధాన కారణం. అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేస్తున్నాయి.