ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల సందర్భంగా దేశంలోనే అత్యంత సంపన్నుడిగా కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ అని తేలింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోటీ చేసిన అభ్యర్థుల అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) అధ్యయనం చేసిన తర్వాత దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎమ్మెల్యే, అత్యంత పేదవాడైన ఎమ్మెల్యే ఎవరో నిగ్గు తేల్చింది. అత్యంత సంపన్నుడిగా నిలిచిన డీకే శివకుమార్ ఆస్తులు రూ.1,400 కోట్లు. ఇందులో ఆయన స్థిరాస్థులు రూ.273 కోట్లు, చరాస్తులు రూ.1140 కోట్లు కాగా, అప్పులు రూ.265 కోట్లు ఉన్నాయి. అత్యంత పేదవాడిగా ఉన్న ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా. ఆయన పశ్చిమ బెంగాల్ ఎంఎల్ఏ. ఆయన ఆస్తి కేవలం రూ.1700 మాత్రమే. తొలి పది మంది సంపన్న ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ వారు నలుగురు ఉంటే, ముగ్గురు బీజేపీ వారు. ఇక దేశంలోని 20 మంది సంపన్న ఎమ్మెల్యేల్లో 12 మంది కాంగ్రెస్ వారేనని ఏడీఆర్ నివేదిక పేర్కొంది.
