స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటును ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకించడాన్ని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తప్పుబట్టారు. నెతన్యాహు వైఖరి ప్రపంచ శాంతికి ముప్పు అని వ్యాఖ్యానించారు. నెతన్యాహు తన వైఖరి మార్చుకోకపోతే, ప్రపంచ శాంతికి సవాల్ విసురుతున్న ఇరు దేశాల వివాదం సుదీర్ఘకాలం కొనసాగే ప్రమాదం ఉందన్నారు. చాలాచోట్ల తీవ్రవాద సంస్థలు పుట్టుకు రావొచ్చని వ్యాఖ్యానించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో గుటెరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనా ప్రజల స్వతంత్ర దేశ ఏర్పాటు హక్కును ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. రెండు దేశాల ఏర్పాటు పరిష్కారాన్ని ఎవరు అంగీక రించకపోయినా ఆ నిర్ణయాన్ని తిరస్కరించాల్సిందే. ఎలాంటి స్వతంత్రం, హక్కులు, గౌరవం లేకుండా అంతమంది పాలస్తీనా ప్రజలు ఒక ప్రాంతంలో ఉండటం అసలు ఊహించలేం అని గుటెరస్ అన్నారు.