అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై మరో ఆంక్ష విధించింది. ఖురాన్‌ను బిగ్గరగా పఠించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సమీపంలో మహిళలే ఉన్నా, అలా పఠించకూడదని స్పష్టంచేసింది. అము టీవీ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా, 2021లో అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలపై పలు ఆంక్షలు విధిస్తూ వస్తున్నది. ప్రార్థన సమయంలో మహిళలు ఇతరులకు వినిపించేంత బిగ్గరగా మాట్లాడకూడదు. ఆమె స్వరం ఇతర మహిళలు కూడా వినకూడదు. అలా బిగ్గరగా పఠిస్తే దానిని అవమానంగా పరిగణిస్తాం అని తాలిబన్ మంత్రి మహ్మద్ ఖలీద్ హనాఫీ పేర్కొన్నారు.