కోకాపేట భూముల వేలంలో పాల్గొన్న సంస్థలన్నీ సీఎం కేసీఆర్ బినామీ సంస్థలేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతల కుటుంబాల వారే భూములను కొన్నారని పేర్కొన్నారు. భూముల వేలంలో నిబంధనలను ఉల్లంఘించారని, ఈ వేలంలో పాల్గొనవద్దని కూడా కొందర్ని హెచ్చరించారని ఆయన ఆరోపించారు. వేలంలో భాగంగా టెండర్లను దాఖలు చేస్తే నిర్మాణాలను అనుమతులు కూడా రాకుండా చేస్తామని కొందరు బెదిరించారని అన్నారు. వ్యాపారవేత్త రామేశ్వర రావు కంపెనీలకు కేసీఆర్ వందల కోట్లు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారన్నారు. కోకాపేట భూముల వేలంలో జరిగినవన్నీ అక్రమాలేనన్నారు. దాదాపు వెయ్యికోట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపించారు. ఓ వైపు ధనిక రాష్ట్రం అని చెబుతూనే, మరోవైపు ప్రభుత్వం భూములను విక్రయిస్తోందని మండిపడ్డారు. భవిష్యత్తు అవసరాలకు భూములు కావాలంటే ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యంగా ఆస్పత్రుల నిర్మాణం, విద్యాలయాలకు భూములు కావాలంటే ఏం చేస్తారని రేవంత్ నిలదీశారు. ఈ టెండర్లపై ప్రభుత్వం స్పందిచకపోతే, ప్రధాని, అమిత్‌షా దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తానని రేవంత్ సంచలన ప్రకటన చేశారు.