రాత్రి సమయంలో త్వరగా పడుకొని, పొద్దునే లేచే వ్యక్తులతో పోల్చితే, రాత్రంతా మేల్కొనేవాళ్లు టైప్-2 డయాబెటిస్ బారినపడే ముప్పు 46 శాతం ఎక్కువ అని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. డయాబెటిస్ రావడానికి జీవన శైలి ఒక్కటే కారణం కాదని, అధిక బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్), పెద్ద పొట్ట, శరీరంలో అధిక కొవ్వులు, ఇవన్నీ టైప్-2 డయాబెటిస్‌ను కలుగజేయడంలో 50శాతం పాత్ర వహిస్తాయని నెదర్లాండ్స్ పరిశోధకులు తేల్చారు.
మూడు రకాలైన నిద్ర సమయాల్ని కలిగిన 5 వేల మందిపై నెదర్లాండ్స్ లైడెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ సైంటిస్టులు పరిశోధన చేశారు. నిద్రపోతున్న తీరుతో మన శరీరంలో జీవ గడియారం ప్రభావితం కాగానే, అది జీవ క్రియల్ని ఆటంక పరుస్తున్నదని, ఇది టైప్-2 డయాబెటిస్‌కు దారితీస్తున్నదని పరిశోధకుడు జిరోన్ వాన్ డెర్ వెల్డె చెప్పారు.