అమెరికాలో ప్రభుత్వం మారగానే మన దేశంలోని ఆశావహ విద్యార్థుల్లో దడ ప్రారంభమైంది. ఉన్నత చదువుల కోసం క్యూకట్టే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ట్రంప్ వస్తే పూర్వంలా అమెరికా వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయా? విదేశీ చదువులపై ఆయన రాక ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్న ప్రశ్నలు మన విద్యార్థులను వేధించడం ప్రారంభించాయి.
డొనాల్డ్ ట్రంప్ పాలనలో విద్యార్థి వీసాలకు ఢోకా ఉండకపోవచ్చు. కానీ ప్రత్యేకించి హెచ్1బీ వీసాలు కఠినతరం కానున్నాయి. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మారనున్నాయి. వర్క్ వీసాలు కష్టమయ్యే అవకాశాలు న్నాయి. ఇదే జరిగితే మాస్టర్స్ చదివి, అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారిపై ఆశలపై నీళ్లు చల్లినట్లే. ట్రంప్ మొదటి నుంచి ఇతర దేశాల నుంచి వలసవచ్చే వారి కఠినమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిననాడే అక్రమ వలసలను అడ్డుకుంటామని ప్రకటించారు. అయితే ఎడ్యుకేషన్ వీసాల పట్ల ట్రంప్ సానుకూలంగానే ఉంటారని, ఇది కొంత అనుకూలమని నిపుణులంటున్నారు.