యూఏఈకి చెందిన రిటెయిలర్ సంస్థ లులు గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లులు మాల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభానికి సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ మాల్ ప్రారంభం కానుంది. ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న లులు మాల్, రెండు లక్షల చదరపు అడుగుల హైపర్ మార్కెట్తోపాటు అత్యంత అధునాతన గ్లోబల్ రిటెయిల్ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కూకట్పల్లిలో ఈ మెగా షాపింగ్ మాల్ ఉంది.
లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ ఎంఏ, ఇతర ప్రముఖుల సమక్షంలో మంత్రి ఈ మాల్ను ప్రారంభించనున్నారు. తెలంగాణలో లులు గ్రూప్కి ఇది మొదటి వెంచర్. రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడుల హామీలో భాగంగా ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్లో నిర్మితమైంది. గత ఏడాది దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో అనేక చర్చలు, అవగాహన ఒప్పందాలు జరిగాయి. అందులో భాగంగానే లులు మాల్ హైదరాబాద్కు వచ్చింది.