ప్రపంచం జనాభా నేటితో 800 కోట్లకు చేరింది. దీంతో ఈ చారిత్రాత్మకమైన కొత్త మైలురాయితో ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 1974లో 400 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 48 ఏండ్లకు రెట్టింపై నేడు 800 కోట్లకు చేరుకొన్నది. ప్రస్తుతానికి ప్రపంచ జనాభాలో చైనా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. వచ్చే ఏడాదికి చైనాను భారత్ దాటేస్తుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్ఎఫ్పీఏ) అంచనా వేసింది. చివరి 100 కోట్ల జనాభాలో భారత్లోనే 17.7 కోట్ల జనాభా పెరుగుదల నమోదైందని తెలిపింది. వైద్యం, విద్య తదితర రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి కారణంగా మరణాలు తగ్గి.. సగటు ఆయుర్దాయం పెరిగిందని, ఫలితంగా జనాభా పెరిగిందని పేర్కొన్నది. మరో 15 ఏళ్లకు అంటే 2037 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.
2023కే చైనాను దాటేయనున్న భారత్
2023 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని ఐరాస అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశ జనాభా 141.2 కోట్ల మేర ఉండగా.. 2050 నాటికి అది దాదాపు 170 కోట్లకు చేరుకుంటుందని ఐరాస అంచనా వేసింది. చైనా జనాభా ప్రస్తుతం 145 కోట్లు ఉండగా.. 2050 నాటికి 130 కోట్లకు తగ్గవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2022లో భారత జనాభాలో 68 శాతం 15 64 ఏళ్ల మధ్య వయసు వారు కాగా, 65 ఏళ్లు , అంతకు పైబడిన వారు జనాభాలో 7 శాతం ఉన్నట్లు ఐరాస తెలిపింది.














