మాతృభాషపై ప్రేమతో ఓ న్యాయమూర్తి 14,232 తీర్పులను హిందీలో వెలువరించి ప్రపంచ రికార్డును సృష్టించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో తీర్పులను ఇంగ్లిష్‌లోనే తీర్పులను వెలువరిస్తుంటారు. కానీ, ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టులో పని చేస్తున్న జస్టిస్ గౌతమ్ చౌదరీ నాలుగేళ్లుగా హిందీలోనే తీర్పులను వెలువరిస్తున్నారు. అయితే, మాతృభాషకు ఇచ్చిన ప్రాధాన్యంతోనే ఇది సాధ్యమైందన్నారు. 2019 డిసెంబర్ 12న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియామకమయ్యారు. అప్పటి నుంచి ఈ నెల 8 వరకు 14,232 తీర్పులను హిందీలోనే వెలువరించి రికార్డును నెలకొల్పారు.
అయితే, ఈ ఘనత సాధించడంలో తన తండ్రి ప్రోత్సాహం ఉందని తెలిపారు. సామాన్యులకు సైతం కోర్టు తీర్పులు సులువుగా అర్థం అవ్వాలనే ఆలోచనతోనే మాతృభాషలో తీర్పులను వెలువరిస్తున్నట్లు పేర్కొన్నారు. జస్టిస్ గౌతమ్ చౌదరి విద్యాభ్యాసాన్ని ఇంగ్లిష్ మీడియంలోనే పూర్తి చేయడం విశేషం. తనకు హిందీ అంటే మక్కువని, అలాగని ఇతర భాషలను ఏమీ తక్కువ చేయనన్నారు. మిగతా భాషలన్నా తనకు గౌరవమని, హిందీ అంటే ఎక్కువ ఇష్టమని వివరించారు.