గిన్నెస్ ప్రపంచ రికార్డుల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన జపనీస్ మహిళ టోమికో ఉతోకా కన్ను మూసినట్లు అషియా నగర అధికారి ఒకరు వెల్లడించారు. ఆమె వయస్సు 116 సంవత్సరాలు. మధ్య జపాన్‌లోని హ్యోగో ప్రిఫెక్చర్‌లోని అషియాలో ఒక ఆదరణ గృహంలో ఇతోకా డిసెంబర్ 29న మరణించినట్లు వృద్ధుల విధానాల ఇన్‌చార్జి అధికారి యోషిత్సుగు నగాటా తెలియజేశారు. అరటిపళ్లు అన్నా, జపాన్‌లో దొరికే కాల్పిస్ అనే యోగర్ట్ రుచిగల పానీయం అన్నా ఇష్టపడే ఇతోకా 1908 మే 23న ఒసాకాలో జన్మించారు. నిరుడు 117 ఏళ్ల స్పెయిన్ మహిళ మరియా బ్రన్యాస్ మరణంతో ఇతోకా అత్యంత వృద్ధురాలుగా పేరు గడించారు. ఇతోకా నిరుడు జన్మదినోత్సవం జరుపుకున్నప్పుదు మేయర్ నుంచి పుష్పగుచ్ఛాలు, ఒక కేకు, ఒక కార్డు అందుకున్నారు.