అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) పురస్కరించుకుని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్‌లో మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద ప్రవాస భారతీయులు యోగా శిక్షణ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్ 21న యోగా కార్యక్రమం జరపడం ఎంతో షంతోషదాయకమన్నారు. ప్రతి రోజూ యోగా చెయ్యడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడంలో సహాయపడిన కార్యకర్తలకు, యోగా శిక్షణ ఇచ్చిన యోగా మాస్టర్ విజయ్, ఐరిస్, ఆనందీలకు, ముఖ్య అతిథి కాన్సల్ జనరల్ అసీం మహాజన్‌కు మహాత్మా గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు దినేష్ హూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షుడు దినేష్ హుడా, బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, షబ్నం మోడ్గిల్, పలు సంస్థల సభ్యులు, ప్రవాస భారతీయులు, చిన్నారులు పాల్గొన్నారు.














