అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వివిధ దేశాలకు చెందిన వారితో కలిసి మోడీ యోగాసనాలు వేశారు. అంతేకాదు వేలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ యోగాకు ఎలాంటి పేటెంట్, రాయల్టీ లేవన్నారు. యోగా డే జరపాలనే భారత్ ప్రతిపాదనకు అన్ని దేశాలు అండగా నిలిచాయని మోడీ గుర్తుచేశారు. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి యోగా ప్రాచుర్యంలో వుందని, యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందన్నారు. యోగా అంటే అందరినీ కలిపేదని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఏడాదిని మిల్లెట్ ఇయర్‌గా భారతదేశం ప్రతిపాదించిందని దీనిని ప్రపంచం ఆమోదించిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో పాటు అంతర్జాతీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. న్యూయార్క్ మేయర్, మూడుసార్లు గ్రామీ అవార్డు గ్రహీత రికీ కెజ్, గాయని ఫాల్గుణి షా, నటులు రిచర్డ్ గేర్, ప్రియాంక చోప్రాతో పాటు ఐక్యరాజ్య సమితి అధికారులు ఈ యోగా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.