నౌకాయానానికి వీలు లేకుండా హొర్ముజ్ జలసంధిని మూసివేసినట్టు ఇరాన్ మరోసారి ప్రకటించింది. గల్ఫ్‌లో అమెరికా తన చట్టవిరుద్ధ కదలికలను కొనసాగిస్తూనే ఉందని ఆరోపించింది. కాగా, ఇరాన్ ప్రకటనకు విరుద్ధంగా ఈ వ్మూహాత్మక జలమార్గం తెరిచే ఉన్నట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్‌కు దానిపై ఎలాంటి నియంత్రణ లేదని, ఈ మార్గంలో నౌకల వాణిజ్య రవాణా యథా ప్రకారం కొనసాగుతున్నదని స్పష్టం చేసింది.

కాగా, ఈ ప్రాంతంలో అమెరికా వైఖరి కారణంగా ఈ జలసంధి మీదుగా ఎలాంటి నౌకల రాకపోకలను అనుమతించబోమని టెహ్రాన్‌కు చెందిన పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ (పీజీఎస్ఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే హొర్ముజ్ జలసంధి మూసివేసినట్టు ఇరాన్ చేసిన ప్రకటనను అగ్రరాజ్యం తోసిపుచ్చుతూ ఈ జలమార్గంలో నౌకాయానం యథావిధిగా జరుగుతున్నదని ప్రకటించింది. ఇదే విషయాన్ని ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా నిర్ధారించారు. ఈ మార్గంలో వాణిజ్య నౌకల రవాణాకు ఎలాంటి ఆటంకం లేదని పేర్కొన్నారు.





























