ప్రముఖ టెక్ దిగ్గజం, అమెరికా లో లిస్ట్ అయిన కాగ్నిజెంట్ కు అక్కడ భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీసా మోసం ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా కొత్తగా గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ ల కోసం దరఖాస్తు చేయకుండా కంపెనీపై యునైటెడ్ స్టేట్స్ కార్మిక శాఖ నిషేధం విధించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పోసిటో అధికారికంగా ప్రకటించారు.

కాగ్నిజెంట్‌తో పాటు మరో టెక్నాలజీ సంస్థ క్లౌడెరా పైనా ఇదే తరహా చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం ప్రకారం కాగ్నిజెంట్ కొత్తగా పీఈఆర్ఎం (ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్) ఫైలింగ్స్ చేసేందుకు వీలుండదు. విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం స్పాన్సర్ చేయాలనుకునే కంపెనీలు తప్పనిసరిగా కార్మిక శాఖ నుంచి ఈ లేబర్ సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపైనే ఇప్పుడు సస్పెన్షన్ విధించడం గమనార్హం. ఈ పరిణామం కాగ్నిజెంట్‌పై ఆధారపడిన వేలాది మంది భారతీయ టెక్ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది.















