అమెరికాలో చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలకునే విదేశీ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలకు తెరలేపింది. విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) కింద పని చేసేందుకుగాను, ప్రతి విద్యార్థి తరపున సంబంధిత విశ్వవిద్యాలయం 70 వేల డాలర్లు(రూ. 58 లక్షలకు పైగా) ఫీజుగా చెల్లించాలనే కొత్త నిబంధనను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆప్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ప్రతిపాదించింది. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ రెన్యువల్ లేదా పొడిగింపు కోసం అదనంగా మరో 30 వేల డాలర్లు వసూలు చేయాలని ప్రతిపాదనలో పేర్కొంది. విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై కఠిన చర్యలు తీసుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం అమెరికాలో డిగ్రీ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు తమ కోర్సుకు సంబంధించిన రంగంలో ఏడాది పాటు పనిచేసేందుకు ఓటీపీ వెసులుబాటు కల్పిస్తున్నది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల విద్యార్థులకు ఈ గడువు మరో రెండేండ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత వీసా వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయని, విదేశాల నుంచి వచ్చే చవకైన శ్రామిక శక్తిని అడ్డుకొనేందుకే ఈ భారీ ఫీజులను ప్రతిపాదించినట్లు డీహెచ్‌ఎస్ తెలిపింది. ఈ ప్రతిపాదన అమెరికాలోని యూనివర్సిటీలు, ఐటీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. తాజా ప్రతిపాదనపై ప్రజలు 60 రోజులపాటు అభిప్రాయాలు, సలహాలు వ్యక్తం చేయవచ్చు. ఆ తర్వాత డీహెచ్‌ఎస్ దీనిని తుది నిబంధనగా ఆమోదించి అమల్లోకి తేవచ్చు.















