యూరప్ దేశమైన ఫ్రాన్స్‌లో కొద్ది రోజులుగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ (ప్యారిస్)లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఫ్రాన్స్‌లో ఉంటున్న భారతీయులతోపాటు, ఆ దేశం పర్యటించాలనుకునే వారి క్షేమం కోసం ఈ సూచన చేసింది. భారతీయులు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే, వీలైనంత వరకు నిరసనలు, ఆందోళనలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. స్థానిక ఫ్రెంచ్ అధికారులు జారీ చేసే సూచనలను తప్పకుండా పాటించాలని కూడా సూచించింది. ఇటీవల ఫ్రాన్స్‌లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలిస్తున్నట్లు పేర్కొంది. భారతీయులు అప్రమత్తంగా, జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించింది.

గత వారం నుంచి ఫ్రాన్స్‌లో నిరసనలు ఆందోళనకర స్థాయిలో జరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, దహనం, పోలీసులపై దాడులు, దోపిడీలు వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో అనేక మంది గాయపడ్డారు. ఫ్రాన్స్‌లో కొంతకాలంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం, నిరుద్యోగం, వైద్య సేవల్లో లోపాలు వంటి వాటిని నిరసిస్తూ ఆందోళనకారులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.















