అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అధిక ధరలు, ఇరాన్‌తో యుద్ధంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనపై ప్రజాభిప్రాయానికి పరీక్షగా మారాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ రిపబ్లికన్లకు ఆధిక్యం ఉన్నది. 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో మెజారిటీ సాధించేందుకు డెమోక్రాట్లకు మూడు స్థానాలు అదనంగా గెలుచుకుంటే సరిపోతుంది. సెనేట్‌లో ఆధిక్యం కోసం నాలుగు స్థానాలు అదనంగా సాధించాలి. దీంతో రెండు సభల్లోనూ పోటీ ఉత్కంఠగా మారింది.

ధరల పెరుగుదలపై ప్రజల్లో అసంతృప్తి తమకు కలిసి వస్తుందని డెమోక్రాట్లు భావిస్తున్నారు. ఏపీ-ఎన్‌ఓఆర్‌సీ సర్వే ప్రకారం ట్రంప్ పనితీరుకు కేవలం 35 శాతం మంది మాత్రమే ఆమోదిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై ఆయనకు మద్దతు 25 శాతానికే పరిమితమైంది. మరోవైపు, ట్రంప్ తన పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తూ తానే పోటీలో ఉన్నట్టు భావించి ఓటు వేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

జార్జియా, నార్త్ కరోలినా, ఓహియో, అలస్కా రాష్ర్టాల్లో సెనేట్ పోటీలు కీలకంగా మారాయి. టెక్సాస్, ఫ్లోరిడా, అయోవా రాష్ర్టాల్లోనూ ప్రతినిధుల సభ స్థానాల కోసం ఇరు పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. దేశవ్యాప్తంగా 36 రాష్ర్టాల్లో గవర్నర్ల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.















