తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఈఎన్ఈ రిపీట్. విశ్వక్‌సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరోసారి కలిసి నటించిన ఈ చిత్రానికి సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తరుణ్‌భాస్కర్ మాట్లాడారు. నాజీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఓ నలుగురు స్నేహితులు నన్ను అంటిపెట్టుకుని ఉండేవారు. పెళ్లి చూపులు తర్వాత నేను ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో ఈ నగరానికి ఏమైంది సినిమా చేయడానికి ప్రేరణ వాళ్లే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ఈఎన్ఈ రిపీట్ చేశాను. ఈ సినిమాపై అంచనాలు బలంగా ఉంటాయని నాకు తెలుసు. అందుకే ఈ నగరానికి ఏమైంది సినిమాకు ఓ ఎపిక్ వెర్షన్‌లా ఉండేలా ఈ ట్రైలర్‌ను కట్ చేశాం. సినిమా కూడా అలాగే ఉంటుంది. పాజిటీవ్ ఎనర్జీతో చేసిన సినిమా ఇది. సక్సెస్‌పై నమ్మకంతో ఉన్నాం. ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది అని అన్నారు.

ట్రైలర్ అద్భుతంగా అనిపించిందని, తరుణ్‌భాస్కర్ ప్రాణంపెట్టి సినిమా చేశారని, నవ్వించే, ఆనందంతో ఏడిపించే అంశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయని హీరో విశ్వక్‌సేన్ చెప్పారు. ఇంకా అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, అనిషా, శివాత్మిక, నిర్మాత సృజన్ కూడా మాట్లాడారు. గందరగోళం, ఉత్సాహాలతో నిండిన ఒక వినోదాత్మక ప్రయాణాన్ని ఈ సినిమా అందించబోతున్నదని ట్రైలర్ చెబుతున్నది. ఈ నెల 19న సినిమా విడుదల కానున్నది.















