Skip to main content

Namaste NRI

తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మెట్రో – ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరల్లో భారీ తగ్గింపు చేశారు. ప్రజలపై ప్రయాణ ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను ఏకంగా రూ.4,000కు తగ్గించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీ ప్రయాణానికి కేటాయించారు. ఈ పాస్ తో నెలలో గరిష్టంగా 50 రౌండ్ ట్రిప్పుల వరకు ప్రయాణించవచ్చు. దీంతో నెలవారీ పాస్ తీసుకునే ప్రతి ప్రయాణికుడికి నెలకు ఏకంగా రూ.4,500 ఆదా అవుతుంది.

రోజువారీ పాస్ రూ.400 నుంచి రూ.275కు రోజువారీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరను కూడా తగ్గించారు. ప్రస్తుతం రూ.400గా ఉన్న పాస్ ధరను రూ.275కు తగ్గించారు. ఇందులో రూ.200 మెట్రోకు, రూ.75 ఆర్టీసీకి కేటాయించారు. ఈ పాస్ ద్వారా రోజుకు 4 సింగిల్ జర్నీలు చేయవచ్చు. రోజువారీ వినియోగదారులకు రోజుకు రూ.125 ఆదా అవుతుంది. నవంబర్ 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని మెట్రో, ఆర్టీసీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఉద్యోగులు, విద్యార్థులు, రోజూ హైదరాబాద్ లో ప్రయాణించే వేలాది మందికి ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుంది. ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడం, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటం తగ్గించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రజల సంక్షేమం, ప్రయాణికుల ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events