ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని మైనంపాడు గ్రామంలో భారీ తుఫాన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆపన్నహస్తం అందించింది.గ్రామంలో చిన్నారులు, పెద్దలకు నవంబర్ 4, 2026న భోజనాల పంపిణీ చేసి కష్టకాలంలో అండగా నిలిచింది.

తుఫాన్ ప్రభావంతో మైనంపాడు గ్రామంలోని కుటుంబాల నివాసాల్లోకి వరదనీరు చేరడంతో వంట చేసుకునే పరిస్థితి లేక చిన్నారులు, పెద్దలు ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న విషయం తానా దృష్టికి వచ్చింది. ఈ పరిస్థితికి వెంటనే స్పందించిన తానా కోశాధికారి రాజా కసుకుర్తి, బాధిత కుటుంబాలకు తానా ఆధ్వర్యంలో భోజనాలు అందించేలా చర్యలు తీసుకున్నారు.

తానా ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు సహా బాధిత కుటుంబాలకు పౌష్టికాహారంతో కూడిన భోజనాలను పంపిణీ చేశారు. విపత్కర పరిస్థితుల్లో తమ ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చిన తానా సేవలను స్థానికులు అభినందించారు.

ఈ సందర్భంగా తానా కోశాధికారి రాజా కసుకుర్తి మాట్లాడుతూ, “ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం మనందరి సామాజిక బాధ్యత. అవసరంలో ఉన్నవారికి సకాలంలో సహాయం అందించడమే తానా సేవా లక్ష్యం” అని పేర్కొన్నారు.

ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి పరిరక్షణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విద్య, వైద్యం, సామాజిక సేవలు, విపత్తు సహాయక కార్యక్రమాల ద్వారా తానా నిరంతరం సేవలందిస్తోంది.ఆపదలో ఉన్నవారికి అండగా – సేవలో ఎల్లప్పుడూ తానా ముందు ఉంటుంది.
















