
అమెరికాలో మరో తెలుగు యువతి అదృశ్యమైంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన శ్రీజ (23) నవంబర్ 2 నుంచి కనిపించడం లేదు. శ్రీజ ఉన్నత చదువు కోసం అమెరికాలోని బోస్టన్ లో నివసిస్తోంది. అక్కడ ఓ కాలేజీలో చదువుతూ, హోటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తోంది. నవంబర్ 2 సాయంత్రం వాకింగ్ వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫోన్ లొకేషన్ చివరిసారిగా సమీప బీచ్ దగ్గర చూపించింది. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆమె తల్లిదండ్రులు కోయ్య యాదగిరిరెడ్డి, రూప తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కూతురు ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి విషయం తెలియడంతో అక్కడి అధికారులతో మాట్లాడారు. పోలీసులు ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు.















