ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, టాలీవుడ్‌లోనూ ఊహించని సంచలనం నమోదైంది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా తమ వైవాహిక బంధానికి అధికారికంగా ముగింపు పలికారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేయడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

‘మా శ్రేయోభిలాషులు.. సన్నిహితులకు..’ అంటూ పవన్ కల్యాణ్ కొణిదెల, అన్నా కొణిదెల పేర్లతో వెలువడిన ఈ ప్రకటన టాలీవుడ్ వర్గాలను, జనసేన శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘మా జీవితంలో ముఖ్యమైన భాగాన్ని కలిసి గడిపాం. ఇప్పుడు పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా వైవాహిక జీవితం ముగిసినప్పటికీ.. మంచి స్నేహితులుగా, మా పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా కొనసాగుతాం. మా పిల్లల ఆనందం, శ్రేయస్సు ఎప్పటికీ మా ఉమ్మడి ప్రాధాన్యాల్లో భాగంగా ఉంటుంది. మా వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న మార్పు ఇది. దీనిని అర్థం చేసుకుంటారని, మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. మా ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మొదటి నుంచీ ఎన్నో ఆటుపోట్లతో ముడిపడి ఉంది. ఇది ఆయనకు మూడో వివాహం కావడం గమనార్హం. సినీరంగ ప్రవేశం తర్వాత తొలిసారిగా ఒక యువతిని వివాహం చేసుకున్నప్పటికీ, కొన్నేళ్లకే మనస్పర్థలతో వారు విడిపోయారు. ఆ తర్వాత 2009లో ప్రముఖ నటి రేణూ దేశాయ్‌ను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అకీరా నందన్, ఆద్య సంతానం. అయితే, ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పరస్పర అంగీకారంతో 2012లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ‘తీన్ మార్’ సినిమా షూటింగ్ సమయంలో రష్యాకు చెందిన అన్నా లెజీనోవాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2013 డిసెంబర్ లో ప్రత్యేక వివాహ చట్టం కింద అన్నా లెజీనోవాను పవన్ కల్యాణ్ మూడో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు మార్క్ శంకర్ కొణిదెల, కుమార్తె పోలేనా అంజనా కొణిదెల జన్మించారు. గత పదేళ్లుగా అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించిన ఈ దంపతులు ఇప్పుడు విడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఒకవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి దృష్టి పెట్టి, మరోవైపు సినిమాలతో పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నారు. ఆయన జీవితంలో తాజా నిర్ణయం రాజకీయ, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశాయి. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇద్దరూ స్నేహపూర్వకంగా విడిపోవాలని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని వారి ప్రకటన ద్వారా కోరారు.
















