శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భక్తులకు కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. మండల- మకరవిళక్కు యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో, పవిత్ర పంబా నదిలో స్నానం చేసిన తర్వాత భక్తులు తమ దుస్తులను నదిలోనే వదిలేయవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల భక్తుల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరుతూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు దేవస్థానం బోర్డు అధికారికంగా లేఖలు రాసింది.

పంబా నదిలో దుస్తులు వదిలేయడం వల్ల దోషాలు తొలగిపోతాయనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఏ శాస్త్రంలోనూ లేదా అయ్యప్ప పూజా విధానంలోనూ అలాంటి ఆచారం లేదని టీడీబీ తేల్చి చెప్పింది. కొందరు గురుస్వాముల మాటలు విని భక్తులు ఇలా చేయడం వల్ల పవిత్ర నదీ జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయని, నీటిలో ప్రమాదకర వైరస్‌లు వ్యాపించే ముప్పు పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు విడిచిపెట్టే దుస్తులు వందల ట్రక్కుల కొద్దీ పేరుకుపోతుండటంతో వాటిని తొలగించడం పారిశుద్ధ్య సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది.

ఈ ఏడాది యాత్రను ‘క్లీన్ శబరిమల, పవిత్ర శబరిమల’ అనే ప్రధాన నినాదంతో నిర్వహిస్తున్నట్లు కేరళ అధికారులు ప్రకటించారు. పంబా నది పవిత్రతను, అటవీ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తుడిపై ఉందని గుర్తుచేశారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ భక్తులకు సరైన సమాచారాన్ని చేరవేసి, పంబా నది కాలుష్య నివారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని దేవస్థానం బోర్డు విజ్ఞప్తి చేసింది.















