Skip to main content

Namaste NRI

బంగారం, వెండి కొనేవారికి బంపర్ జాక్‌పాట్!

పసిడి, వెండి ప్రియులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త! ఆకాశాన్నంటి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రేట్లు భారీగా పతనమై కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చాయి.

నిన్నటి ముగింపు ధర రూ.1.33 లక్షలతో పోలిస్తే, ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా రూ.5,300 మేర కుప్పకూలింది. దీంతో తులం పసిడి రూ.1.30 లక్షల మార్క్ దిగువకు పడిపోయి, రూ.1,27,900 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. నిన్న రూ.1.65 లక్షలుగా ఉన్న కిలో వెండి ధర, నేడు రూ.10 వేలకు పైగా భారీగా తగ్గి రూ.1,54,680కి దిగొచ్చింది. మరోవైపు కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో డిసెంబరు డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.1.22 లక్షలు, కిలో వెండి రూ.1.49 లక్షలుగా కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే తరహా భారీ పతనం కనిపిస్తోంది. గత కొంతకాలంగా 4 వేల డాలర్ల పైనే కొనసాగిన స్పాట్ గోల్డ్ ఔన్సు ధర, కొద్ది రోజుల వ్యవధిలోనే 500 డాలర్లకు పైగా పడిపోయి ప్రస్తుతం 3,546 డాలర్ల వద్ద పలుకుతోంది. అలాగే ఔన్సు వెండి ధర 41.84 డాలర్లుగా ఉంది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ఈ ధరల తగ్గుదల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద వరంగా మారింది. శుభకార్యాల కోసం బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక్కరోజే వేల రూపాయలు ఆదా అయ్యే అవకాశం దక్కింది. కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో డిసెంబర్ ఫ్యూచర్స్ ధరలు ఇంకా తక్కువగా ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో, రానున్న రోజుల్లో ధరలు మరింత దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పెళ్లిళ్ల అవసరాలు ఉన్నవారు ప్రస్తుత తగ్గింపును సద్వినియోగం చేసుకుని కొంతమేర కొనుగోళ్లు జరపడం ఉత్తమమని, పెట్టుబడిదారులు మాత్రం అంతర్జాతీయ మార్కెట్ కదలికలను గమనిస్తూ వేచి చూడటం మంచిదని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events