Skip to main content

Namaste NRI

యూకే పర్యటనలో ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ బృందం పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ను వైద్య, ఆరోగ్య రంగంలో దేశంలోనే అగ్రగామిగా, అంతర్జాతీయ స్థాయిలో మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన విజన్‌కు అనుగుణంగా వైద్య రంగంలో ఆధునిక సాంకేతికత, ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలు, అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీర పాండ్యన్ ఐఏఎస్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఐదు రోజుల పాటు యునైటెడ్ కింగ్‌డమ్‌లో పర్యటిస్తోంది. లండన్‌లో ప్రారంభమైన ఈ పర్యటనలో భాగంగా బ్రిటన్‌లోని ప్రముఖ వైద్య, విద్యా, పరిశోధనా సంస్థల ప్రతినిధులతో బృందం సమావేశమవుతోంది.

యూకే పర్యటనలో భాగంగా వైద్య విద్య, ఆధునిక వైద్య సదుపాయాలు, పరిశోధనలు, ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ వినియోగం, పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, నేషనల్ హెల్త్ సర్వీస్, క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, గేట్స్ ఫౌండేషన్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ఏపీ బృందం సమావేశమవుతోంది.

ఈ సమావేశంలో యూకేలో స్థిరపడిన తెలుగు వైద్యులు, వైద్య రంగ నిపుణులు, ప్రవాస ఆంధ్రులతో ఏపీ ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్లు, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను ప్రజలకు చేరువ చేసే మార్గాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమాల సమన్వయంలో యూకే ప్రవాసాంధ్రులు, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు, ఏపీఎన్‌ఆర్టీ కోఆర్డినేటర్లు తమవంతు సహకారం అందిస్తున్నారు. విదేశాల్లో వైద్య రంగంలో పనిచేస్తున్న తెలుగు నిపుణుల అనుభవం, పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడేలా అనుసంధానం చేయడం ఈ ప్రయత్నంలో ముఖ్యమైన అంశంగా నిలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events