ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యే లేదా కీలక కార్పొరేషన్ పదవుల వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ, ఏపీ రోడ్లు, భవనాలు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి అందుకు భిన్నంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయి రాజకీయాల నుంచే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఏకంగా బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్ పీఠంపై కన్నేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైన వేళ, ఇందిరా రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడం నంద్యాల జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. బనగానపల్లె ఎంపీడీవో కార్యాలయానికి భారీ అనుచరగణంతో చేరుకున్న ఆమె, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఒక కేబినెట్ మంత్రి భార్య స్వయంగా పంచాయతీ ఎన్నికల బరిలో నిలవడంతో, బనగానపల్లె సర్పంచ్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన బీసీ ఇందిరమ్మ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. బనగానపల్లె మేజర్ పంచాయతీని రాష్ట్రంలోనే నంబర్ వన్ ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. పట్టణ స్థాయిలో మౌలిక వసతుల కల్పన, మెరుగైన పారిశుద్ధ్యం, నిరంతర తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల ఆదరణ, ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలుపొందుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.















