అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు తెరలేపారు. అమెరికా, చైనా దేశాలు పరస్పరం గూఢచర్యం చేసుకుంటున్నాయని ఆయన బహిరంగంగా వెల్లడించారు. చైనా తమపై నిఘా పెడుతోందని, తాము కూడా చైనాపై నిఘా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో చైనా కంటే అమెరికానే మెరుగ్గా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీకి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని రెండు అగ్ర ఆర్థిక శక్తులైన అమెరికా, చైనా మధ్య ఇప్పటికే వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగాల్లో పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు గూఢచర్యానికి పాల్పడుతున్నాయంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.















